![]() |
![]() |
(నవంబర్ 27 బప్పీలహరి జయంతి సందర్భంగా..)
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక పెను సంచలనం బప్పీలహరి. అప్పటి వరకు ఒక తరహా సంగీతానికి అలవాటు పడిన ప్రేక్షకులకు డిస్కో, ఫాస్ట్‌బీట్ సాంగ్స్‌ను పరిచయం చేసిన ఘనత బప్పీలహరికే దక్కుతుంది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒరియా భాషల్లో 500కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. అలాగే మూడు బంగ్లాదేశ్ సినిమాలు కూడా చేశారు. తెలుగులో అత్యధిక సినిమాలకు సంగీతం అందించిన ఏకైక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి. 1989లో వచ్చిన ఐ విట్నెస్ టు మర్డర్ అనే హాలీవుడ్ సినిమాకి కూడా సంగీతాన్నందించారు. 1986 సంవత్సరంలో 33 సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా 180 పాటలను రికార్డ్ చేసిన సంగీత దర్శకుడిగా బప్పీలహరి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.
1952 నవంబర్ 27న వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురిలో అపరేష్, భాన్సురీ లహరి దంపతులకు జన్మించారు బప్పీలహరి. అతని అసలు పేరు అలోకేష్ అపరేష్ లహరి. తల్లిదండ్రులిద్దరూ క్లాసికల్ సింగర్స్. చిన్నతనం నుంచే వారు బప్పీకి సంగీతంలో శిక్షణ ఇచ్చారు. మూడేళ్ల వయసులోనే తబల వాయించి అందరి దృష్టినీ ఆకర్షించారు బప్పీ. సంగీతంలోని మెళకువలన్నీ తెలుసుకున్న తర్వాత 19 ఏళ్ల వయసులో బొంబాయి చేరుకున్నారు. 1974లో ‘దాడు’ అనే బెంగాలీ సినిమాకి తొలిసారి సంగీత దర్శకత్వం వహించారు. అతను కంపోజ్ చేసిన తొలిపాటను లతా మంగేష్కర్ ఆలపించారు. తొలి హిందీ సినిమా ‘నన్హా షికారి’. 1975లో వచ్చిన ‘జక్మీ’ చిత్రం బప్పీలహరికి మ్యూజిక్ డైరెక్టర్‌గా బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాలో ఆయన చేసిన ఫాస్ట్ బీట్ సాంగ్స్, డిస్కో సాంగ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక అప్పటి నుంచి డిస్కో సాంగ్స్ చెయ్యాలంటే బప్పీలహరీయే చెయ్యాలి అన్నంత పేరు తెచ్చుకున్నారు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా డిస్కో సాంగ్స్ చేస్తున్నప్పటికీ బప్పీ చేసే పాటలు ప్రత్యేకంగా ఉండడంతో ఎక్కువ జనాదరణ పొందాయి. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ చిత్రంతో బప్పీలహరి ఖ్యాతి ఒక్కసారిగా పతాకస్థాయికి చేరింది. ఈ చిత్రంలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత కసమ్ పైదా కర్నేవాలేకి, నమక్‌హలాల్, షరాబి, డాన్స్ డాన్స్, హిమ్మత్వాలా, మవాలి.. ఇలా ఒకటి కాదు వరసగా బప్పీలహరి చేసిన పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. సంగీత దర్శకుడిగానే కాదు, సింగర్‌గా ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ పాడారు.
1980, 1990వ దశకాలలో బప్పీలహరి మ్యూజిక్ ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. బాలీవుడ్‌లోని టాప్ హీరోలందరి సినిమాలకు సూపర్‌హిట్ పాటల్ని అందించారు. 1986లో సూపర్‌స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ చిత్రం ద్వారా తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు బప్పీలహరి. ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్ అవ్వడంతో తెలుగులో వరస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువగా సంగీతాన్ని అందించారు బప్పీలహరి. ఆ సినిమాలన్నీ మ్యూజికల్‌గా చాలా పెద్ద విజయాలు సాధించాయి. కొందరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో కూడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేసినప్పటికీ అత్యధికంగా తెలుగులో 25 సినిమాలకు సంగీతం అందించిన ఘనత బప్పీలహరికే దక్కుతుంది. 2020లో రవితేజ హీరోగా వచ్చిన ‘డిస్కోరాజా’ చిత్రంలో రవితేజ, శ్రీకృష్ణలతో కలిసి ఒక పాట పాడారు బప్పీలహరి. తెలుగులో ఆయన పాడిన ఒకే ఒక్క పాట అది.
మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా బప్పీలహరి ఎంత పాపులర్ అయ్యారో, ఆయన గెటప్ కూడా అంతే పాపులర్ అయింది. ఎప్పుడూ ఒంటినిండా నగలతో అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేవారు బప్పీలహరి. బంగారు నగలు ధరించడం తనకు బాగా కలిసి వస్తుందని ఆయన చెప్పేవారు. దానికి ఇన్స్పిరేషన్ అమెరికన్ పాప్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ. ఆయనలాగే ఎప్పుడూ బంగారు నగలతో ధగధగ మెరుస్తూ కనిపించేవారు బప్పీలహరి.
దాదాపు 5 దశాబ్దాలపాటు తన సంగీతంతో అలరించిన బప్పీలహరి.. చనిపోయే వరకు సంగీత దర్శకుడుగా, సింగర్‌గా పనిచేస్తూనే ఉన్నారు. 2022 ఫిబ్రవరి 15న ఒఎస్ఎ అనే వ్యాధి కారణంగా కన్నుమూశారు. అంతకు నెలముందు పలు ఆరోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్లో చేరిన బప్పీలహరిని ఫిబ్రవరి 14న డిశ్చార్జ్ చేశారు. ఆ మరుసటిరోజే ఆయన కన్నుమూయడం అందర్నీ బాధించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బప్పీలహరి పాటలకు ఇప్పటికీ ఆదరణ ఉందంటే సంగీత ప్రియులపై ఆయన ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
![]() |
![]() |